Driving License | హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తేతెలంగాణ) : మద్యం తాగి వాహనం నడిపితే వాహనదారుడిపై కేసు నమోదుతోపాటు లైసెన్స్ రద్దు కానున్నది. అధిక వేగం, బరువుతో గూడ్స్ వెహికల్స్ నడిపినా లైసెన్స్ రద్దు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టనున్నారు. ఏడాదిలో రాష్ట్రంలో 15,209 లైసెన్సులను రవాణాశాఖ సస్పెండ్ చేసింది. ఇందులో ఎక్కువగా డ్రంక్ అండ్ డైవ్ కేసులే ఉన్నట్టు తెలిపారు.
ఒకే వ్యక్తి మూడుసార్లు మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుపడితే లైసెన్సును సస్పెండ్ చేసేందుకు పోలీసులు రవాణాశాఖకు సిఫార్సు చేయనున్నారు. రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. లైసెన్స్ విధానాన్ని కట్టుదిట్టం చేసేందుకు రవాణా, పోలీస్ శాఖలు డేటాబేస్‌ను ఆధునికరించాలని యోచిస్తున్నాయి. పట్టుబడిన వ్యక్తి ఫోటో లేదా ఆధార్ నంబర్ డేటాబేస్‌తో కనెక్ట్ చేయడంతో లైసెన్సు నంబర్, ఎక్కడ తీసుకున్నది క్షణాల్లో అధికారులకు తెలిసిపోనున్నది. దీంతో రవాణాశాఖ సులభంగా లైసెన్స్ సస్పెన్షన్ చేపట్టనున్నారు.