హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు లోహియా సామాజిక న్యాయ పురసారాన్ని ఆదిలీలా ఫౌండేషన్ ఢిల్లీలో బహూకరించింది. ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా డాక్టర్ రామ్మనోహర్ లోహియా సామాజిక న్యాయ పురసారాన్ని ఈఏడాది నుంచే అందిస్తున్నారు. దీనిలోభాగంగా ఆదివారం ఢిల్లీలో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆదినారాయణ నేతృత్వంలో జరిగింది.
ఈ సందర్భంగా వకుళాభరణానికి ప్రశంసాపత్రంతోపాటు రూ.1.15లక్షల నగదు పురస్కారం, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత సీనియర్ ఐఏఎస్, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసీజీ) డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించిన జీ అశోక్‌కుమార్, పీవీ ఆర్ మూర్తి, పలు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, ప్రముఖ సామాజికవేత్తలు పాల్గొన్నారు.