ఖైరతాబాద్, జూన్ 7 : నిమ్స్ నూతన డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ నగరి బీరప్ప ఉద్యోగ కాలం ఈ నెల 6న ముగియడంతో ఆయన స్థానంలో డాక్టర్ రాహుల్ దేవరాజ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. వనపర్తికి చెందిన డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ గాంధీ మెడికల్ కళాశాల నుంచి 1992లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1998లో ఎంఎస్ జనరల్ సర్జరీ, 2002 లో ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎంసీహెచ్, యూరాలజీ పూర్తిచేశారు. ప దేండ్లుగా నిమ్స్‌లోని యూరాలజీ విభాగం ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. మొత్తం 21 ఏండ్ల టీచింగ్, క్లినికల్ అనుభవంతో కేవలం మూడేండ్ల కాలంలోనే 500 రీనల్ ట్రాన్స్ప్లాంట్స్ను విజయవంతంగా జరిపి, దక్షిణ భారత దేశంలోనే నిమ్స్ యూరాలజీ విభాగాన్ని 3వ అత్యుత్తమ విభాగంగా నిలిపారు.
కాంప్లెక్స్ రోబోటిక్ యూరో-ఆంకాలజీ అండ్ రీకన్స్ట్రక్టివ్ యూరాలజికల్ ప్రొసీజర్స్‌లో అనుభవం ఉన్న ఆయన దాదాపు 550కి పైగా రోబోటిక్ ప్రొసీజర్స్, వేలాది ఎండో యూరోలాజికల్ ప్రొసీజర్స్, వెయ్యికి పైగా యూరో-అంకాలజీ ప్రొసీజర్స్ నిర్వహించారు. సంవత్సరానికి 11వేల యూరో ప్రొసీజర్లు నిర్వహించన ఘనత డాక్టర్ రాహుల్‌కే దక్కింది. రెండు వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిపి దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిన రాహుల్ దేవరాజ్ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నిమ్స్ బాధ్యతలు అప్పగించింది. ఆదివారం పూర్వ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతివీర్, పలువురు విభాగాధిపతులు, వైద్యులు డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్‌ను అభినందించారు.
మరింత తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా
నిమ్స్‌ను వైద్య సేవలు, వైద్య విద్యా పరిశోధన రంగాల్లో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు తనవంతు విశేష కృషి చేస్తానని నూతన డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ తెలిపారు. రోగులకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.