హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా డాక్టర్ వైఎస్సార్, డాక్టర్ కేవీపీ ఫౌండేషన్ రూ.21 లక్షల రివాల్వింగ్ ఫండ్ (శాశ్వత నిధి)ని హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అందజేసింది. తన ఆప్తమిత్రుడు, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కలలను సాకారం చేసే దిశగా మాజీ ఎంపీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ఈ ఫౌండేషన్‌ను స్థాపించారు. ప్రతి ఏటా ఈ యూనివర్సిటీలో వ్యవసాయ శాస్ర్తాలను అభ్యసిస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఓ విద్యార్థికి నగదు బహుమతిగా రూ.లక్ష అందించడం కోసం కేవీపీ ఫౌండేషన్ రూ.21 లక్షల నిధిని సమకూర్చింది. యూనివర్సిటీ 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ సెమినార్లో.. ఫౌండేషన్ తరఫున మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రూ.21 లక్షల చెక్కును వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యకు అందజేశారు.
వ్యవసాయ శాస్ర్తాలలో విద్యాపరమైన ప్రతిభను ప్రోత్సహించడానికి, అర్హులైన విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి ఈ ఫండ్‌ను నెలకొల్పినట్టు ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ సీఎం వైఎస్‌కు వ్యవసాయం ఎంతో ప్రీతిపాత్రమైన అంశమని, ఆయన నిరంతరం రైతుల సంక్షే మం, వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేశారని పేర్కొన్నది. విద్య, వ్యవసాయరంగ పురోగతి ద్వారా గ్రామీణ సమాజాలను బలోపేతం చేయాలన్న వైఎస్ దార్శనికతకు, నిబద్ధతకు ఈ ఫండ్ రూపంలో తగిన నివాళి అర్పిస్తున్నామని తెలిపింది. కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ మధుర స్వామినాథన్, రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.