హైదరాబాద్, సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే దాన్ని జయించవచ్చని, చాలామంది అలా గుర్తించకపోవడంతోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఎమ్ఎన్జే క్యాన్సర్ దవాఖాన వైద్యుడు డాక్టర్ కృష్ణచైతన్య తెలిపారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పుతో 40 శాతం క్యాన్సర్లను ముందస్తుగానే నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. దీనిలో భాగంగా ఎమ్ఎన్జే దవాఖాన ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లోపాటు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం క్షేత్రస్థాయి క్యాన్సర్ స్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ముఖ్యంగా మహిళలకు గర్భాశయ, రొమ్ము, నోటి క్యాన్సర్లపై ప్రత్యేకదృష్టి సారించినట్టు వెల్లడించారు. ఎమ్ఎన్జే దవాఖానలో మూడేండ్లలో నయాపైసా ఖర్చులేకుండా 150 ఎముక మజ్జ మార్పిడి శస్త్ర చికిత్సలను నిర్వహించినట్టు పేర్కొన్నారు. నాలుగునెలల క్రితం స్థాపించిన డేకేర్ కీమోథెరపి కేంద్రాల ద్వారా వివిధ జిల్లాల్లో సుమారు 1200 కీమోథెరపి సెషన్లను ఉచితంగా నిర్వహించినట్టు తెలిపారు. ఎమ్ఎన్జేలో క్లిష్టమైన శస్త్రచికిత్సలను రోబోటిక్ ద్వారా నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దారి తప్పిన, సరిహద్దులు దాటి తెలంగాణలో సంచరిస్తున్న పులులను గుర్తించడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. ఇటీవల సిద్దిపేట-యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులో పెద్దపులి సంచరించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అరణ్యభవన్‌లో నిర్వహించిన సమావేశంలో పీసీసీఎఫ్ డాక్టర్ సువ ర్ణ మాట్లాడుతూ పులల కదలికలను కెమెరాల ద్వారా నిరంతరం గమనిస్తామని చెప్పారు.