హైదరాబాద్ సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగంతో మనిషి జీవితకాలం 40 శాతానికి పడిపోతున్నదని ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ జయలలిత తెలిపారు. 40 శాతం మంది పురుషులు, 19 శాతం మంది స్త్రీలు పొగాకును వినియోగిస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయని పేర్కొన్నారు.
13-15 ఏండ్ల వయసున్నవారిలో 9 శాతం, 15 ఏటనే పొగ తాగడం ప్రారంభించిన వారు 6.8 శాతం ఉన్నట్టు గణాంకాలు పేర్కొన్నట్టు తెలిపారు. ధూమపానం వల్ల 85 శాతం మంది ఊపిరితిత్తుల క్యాన్సర్కు గురవుతున్నారని, పొగాకు ఉత్పత్తుల వల్ల 43 శాతం మంది గుండెపోటు బారినపడుతున్నారని డాక్టర్ జయలలిత పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల నోటి క్యాన్సర్, పళ్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడే అవకాశం ఉన్నదని హెచ్చరించారు.