హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 19 : ప్రస్తుతం యువత మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉందని, నా ఆవిష్కరణ ఈ దేశానికి ఉపయోగపడేలా ఉండాలనే మైండ్ సెట్ రావాలి.. ప్రపంచ సాంకేతికతో పోటీపడే మనస్తత్వం, ఆవిష్కరణలో కొత్తదనం, ఏఐ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం టెక్నాలజీ లాంటి ఏరియాలు అధ్యయనం, పరిశోధనకు యువతలో రావాలని డీఆర్డీవో పూర్వపు చైర్మన్ భారత ప్రభుత్వ మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి అన్నారు.
కాకతీయ యూనివర్సిటీ సెనెట్హాల్లో ‘తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్’(Telangana Science Congress) అట్టహాసంగా ప్రారంభమైంది. కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సతీష్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘ఇన్నోవేటివ్ స్కిల్స్ఫర్ ఎంపవర్మెంట్ సైన్స్అండ్ టెక్నాలజీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ యంగ్ ఇండియా’ థీమ్‌తో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు, యువత నూతన ఆవిష్కరణలు భారతదేశానికి ఆదర్శమని, 4.34 కోట్ల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఈ సంఖ్య కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ అన్నారు.
భారతీయ యువత ఎక్కువ మంది ప్రపంచం వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని, వేల ఇంజినీరింగ్ విద్యాసంస్థలు రాష్ర్టంలో ఉన్నాయన్నారు. 1.5 మిలియన్ మంది దేశం నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్నారని, 90 శాతం మంది ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. గ్రామీణ, కుటుంబ నేపథ్యం అనేది ముఖ్యం కాదు ఆలోచన సరళి ముఖ్యమన్నారు. ప్రపంచానికి భారత్ అవసరం ఉందని, తెలంగాణ రాష్ర్టంలో కాకతీయుల పేరుతో ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయం గొప్ప గొప్ప వ్యక్తులను అందించిందన్నారు. యూనివర్సిటీకి రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి,తెలంగాణ అకాడమీ అఫ్ సైన్స్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సీహెచ్.మోహనరావు,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం,హైదరాబాద్ సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే. నందుకూరి ,డాక్టర్ కే.సుజాత తదితరులు పాల్గొన్నారు.