రియల్ రంగానికి కేరాఫ్‌గా ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఒక్కసారిగా చతికిల పడింది. కొంత కాలంగా ఈ ప్రభావం కనిపిస్తున్నా, అక్టోబర్‌లో మాత్రం పరిస్థితి మరీ దారుణంగా మారింది. గడిచిన నెలలతో పోలిస్తే క్రయవిక్రయాలు దాదాపుగా నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం 45 శాతానికి పడిపోయింది. 13 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉండగా, దీని ప్రభావం అనుసంధాన రంగాలపై భారీగా పడుతున్నది. మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అపార్ట్మెంట్లు, సొంత గృహాలు, వాణిజ్య భవనాల వంటి కన్స్ట్రక్షన్స్ నెమ్మదించగా, ఈ ఎఫెక్ట్ గ్రానైట్‌పై పడింది. ఇంకా ఇటుక, సిమెంట్, కంకర వంటి వాటిపైనా పెను ప్రభావం చూపుతుండగా.. భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న ఆందోళన ప్రస్తుతం నిర్మాణరంగంలో కనిపిస్తున్నది.
కరీంనగర్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి కేరాఫ్‌గా నిలిచింది కరీంనగర్ ఉమ్మడి జిల్లా. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ, కమర్షియల్ స్థలాల ధరలు ఊహకు అందనంతగా పెరిగాయి. పల్లెల్లో ఒకనాడు ఐదు నుంచి ఏడు లక్షలు ఉన్న ఎకరం భూమి, దాదాపు 20లక్షల నుంచి 40కి లక్షలకు పెరిగిన పరిస్థితులున్నాయి. సమైక్యరాష్ట్రంలో కొనుగోలుకు ఉపయోగపడని స్థలాలు సైతం కోట్ల ధరలు పలికాయి.
ప్రధానంగా కాళేశ్వరం జలాలు రావడంతో వ్యవసాయ భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఒకప్పుడు కరువుకు కేరాఫ్‌గా ఉన్న మండలాలు పచ్చగా మారడం, రైతుబంధు అందడం, ఉచిత విద్యుత్ నిరంతరంగా సరఫరా కావడం వంటి అనేక కారణాల వల్ల సాగు భూములకు ఆనాడు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలోనే క్రయవిక్రయాలు జోరుగా సాగాయి, కానీ, ప్రస్తుతం పరిస్థితి తారుమారైనట్టు కనిపిస్తున్నది.
ప్రధానంగా ఇటీవల హైదరాబాద్‌లో చేపట్టిన హైడ్రా ప్రభావం ఉమ్మడి జిల్లాలపై స్పష్టమవుతున్నది. గడిచిన మూడేళ్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చూస్తే.. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కలిపి ప్రతినెలా సుమారు 7 నుంచి 8వేల క్రయవిక్రయాలు జరిగినట్టు వెల్లడవుతున్నది. ఒక్కో నెలలో ఈ సంఖ్య తొమ్మిది వేలకు పైగాపెరిగింది. అలాగే రెవెన్యూ కూడా ప్రతి నెలా సుమారు 20కోట్ల నుంచి 25 కోట్ల వరకు వచ్చింది. కానీ, అక్టోబర్‌లో మాత్రం ఉమ్మడి జిల్లా మొత్తంగా కేవలం 3,115 రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీని ద్వారా కేవలం 9.77 కోట్ల ఆదాయం సమకూరింది.
క్రయవిక్రయాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఆదాయం 45 శాతానికి పడిపోయింది. వచ్చే నవంబర్లోనూ అదే పరిస్థితి కొనసాగే అవకాశమున్నది. ఈ నెలలో ఇంకా దారుణమైన పరిస్థితులున్నాయని రిజిస్ట్రేషన్ శాఖాధికారులు ద్వారా సమాచారం తెలుస్తున్నది. నిజానికి దసరా పండుగ తర్వాత మార్కెట్ కుదుటపడుతుందని అందరూ ఆశించినా, ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. పైగా రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రియల్ రంగం దెబ్బతినడంతో ఈ ప్రభావం నిర్మాణ రంగానికి అనుసంధానంగా ఉన్న అన్ని రంగాలపై పడుతున్నది. ఇటుక ఉత్పత్తి 20 నుంచి 30 శాతానికి తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 125 మందికి పైగా ఇటుక తయారీదారులు ఉన్నారు. గత లెక్కలు తీసుకుంటే ఏటా వంద కోట్ల ఇటుకలు తయారు చేసేవారు. అందులో పెద్దపల్లి జిల్లాలోనే దాదాపు 50కోట్లకుపైగా ఇటుకలు, మిగిలిన కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో కలిపి రూ. 50కోట్ల వరకు తయారయ్యేవి.
నాలుగైదు నెలలుగా నిర్మాణ రంగంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటుక విక్రయాలపై ప్రభావం పడుతున్నది. దీంతో ఇటుకబట్టీల దారులు ప్రొడక్షన్ తగ్గించారు. కొన్ని చోట్ల ధరలు తగ్గించి అమ్ముతున్నారు. నిజానికి ప్రతి వేసవిలో తయారు చేసే ఇటుక అక్టోబర్ నాటికి పూర్తయ్యేది. కానీ, ఈ సారి మార్చి వరకు వచ్చే అవకాశాలున్నాయని నిర్మాణదారులు అంటున్నారు. అలాగే, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్రంగా పనిచేసే రెండు సిమెంట్ కంపెనీలు తమ ప్రొడక్షన్లో 20శాతం వరకు తగ్గించాయని చెబుతున్నారు.
అలాగే కంకర ఉత్పత్తితోపాటు ఆర్ఎంసీ కంపెనీలకు కూడా ఈ సెగ తాకుతున్నది. నిర్మాణ రంగంలో నెలకొన్న ప్రభావం.. ఉమ్మడి జిల్లాలోని గ్రానైట్ వ్యవస్థపైనా పడింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 380కిపైగా గ్రానైట్ కటింగ్ మిషన్లు నడుస్తుండగా, ఈ మిషన్ల ద్వారా దాదాపు ఏటా రెండు కోట్ల ఎస్ఎఫ్టీ వరకు గ్రానైట్ ఉత్పత్తి చేస్తున్నారు. నిర్మాణ రంగం కుదేలు కావడం, ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించకపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా కటింగ్ మిషన్లు రోజువారీ కార్యకలాపాలు నడిపించడానికే యజమానులు నానా తిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఆదివారం ప్రొడక్షన్ హాలిడే ప్రకటించి ఉత్తత్తి నిలిపివేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయో అన్న ఆందోళన అన్ని రంగాల్లో నెలకొంది. అంతేకాదు, భవిష్యత్ ఏరకంగా ఉంటుందోనన్న భయం ఆయా నిర్మాణ రంగాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది.