హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఫస్టియర్లో అడ్మిషన్లు కల్పించే దోస్త్ ఇంట్రా కాలేజీ ఫేజ్-2 షెడ్యూల్ విడుదలయ్యింది. దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన షెడ్యూల్ విడుదల చేశారు. ఆసక్తి గల వారు ఈనెల 24,25న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 26న సీట్లు కేటాయిస్తారు. ఈ విధానంలో ఒక కాలేజీలో సీటు వచ్చిన విద్యార్థి, అదే కాలేజీలో మరో బ్రాంచిలో సీటు ఖాళీగా ఉంటే ఆ సీటును ఎంపికచేసుకోవచ్చు. అదే కాలేజీలో ఉంటే మాత్రమే అవకాశముంటుంది. మరో కాలేజీలో అవకాశముండదు.
డీఈఈసెట్ స్పాట్ అడ్మిషన్లు
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : డీఎడ్ కోర్సుల్లో మిగులు సీట్ల భర్తీకి అధికారులు మరో అవకాశం ఇచ్చారు. రెండో డీఈఈసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ డైర్టెర్ నవీన్ నికోలస్ శనివారం విడుదల చేశారు. ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 25న ఖాళీ సీట్లను ప్రదర్శిస్తారు. 26న ప్రభుత్వ డైట్ కాలేజీలు, 28న ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తారు. డైట్ కాలేజీల్లో 40, ప్రైవేట్ కాలేజీల్లో 334 చొప్పున మొత్తం 374 సీట్లు ఖాళీగా ఉన్నాయి.