లాస్ ఏంజెల్స్ : ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నడుమ బోయింగ్ ఈ-4బీ నైట్‌వాచ్ విమానం 51 ఏండ్లలో తొలిసారి కనిపించింది. దీనిని ‘డూమ్స్‌డే ప్లేన్’ అని, ‘ఫ్లయింగ్ పెంటగాన్’ అని కూడా పిలుస్తారు. దీనికి సంబంధించిన చాలా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విమానం లాస్ ఏంజెల్స్ విమానాశ్రయంలో గురువారం కనిపించింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ దీనిలో ఉన్నారు. ఈ వార్తలపై పెంటగాన్, వైట్ హౌస్ స్పందించలేదు. అయితే, ఫ్లైట్ ట్రాకర్స్ విశ్లేషణ ప్రకారం, దీని రాక వెనుక ప్రత్యేకంగా వైట్ హౌస్ నుంచి అలెర్ట్ సందేశం ఏమీ లేదని తెలుస్తున్నది. ఈ విమానాన్ని ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అత్యాధునికంగా తయారు చేశారు. ఇది ప్రస్తుతం నేషనల్ ఎయిర్‌బోర్న్ ఆపరేషన్స్ సెంటర్‌గా పని చేస్తున్నది.
అత్యంత తీవ్రమైన అత్యవసర పరిస్థితుల్లో సైతం అమెరికన్ ప్రభుత్వం తన కార్యకలాపాలను కొనసాగించడానికి వీలుగా ఈ విమానాన్ని తీర్చిదిద్దారు. నేషనల్ ఎమర్జెన్సీ లేదా భూమిపైగల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ ధ్వంసమైన పక్షంలో, ఈ విమానం కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్ సెంటర్‌గా ఉపయోగపడుతుంది. దీని ద్వారా అమెరికన్ దళాలకు ఆదేశాలు ఇవ్వవచ్చు. ఎమర్జెన్సీ యుద్ధానికి సంబంధించిన ఆదేశాలను అమలు చేయవచ్చు. సివిల్ అథారిటీల కార్యకలాపాలను సమన్వయపరచవచ్చు. 1974లో దీని సేవలు ప్రారంభమయ్యాయి. దీనిలో 111 మంది ప్రయాణించవచ్చు. అణు విపత్తులు సంభవించి, ప్రపంచం అంతమయ్యే సందర్భాల్లో సైతం ఇది ఆకాశంలో దాదాపు వారం రోజులు ఎగురుతూ సేవలందిస్తుంది. గాలిలోనే రీఫ్యూయలింగ్ చేసుకుంటుంది. అందుకే దీనిని డూమ్స్‌డే ప్లేన్ అంటారు.