కరీంనగర్ తెలంగాణచౌక్, నవంబర్ 25: కంపెనీల ఏర్పాటుకు పంటలు పండించే రైతుల భూములను తీసుకోవద్దని చట్టంలో స్పష్టంగా ఉన్నదని తెలంగాణ రైతు సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి బీ చంద్రకుమార్ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు వ్యతిరేకిస్తే ఆ భూములను ప్రభుత్వం తీసుకోవద్దని చెప్పారు. ప్రభుత్వ చర్యలు రైతులకు లాభం చేసేలా ఉండాలి కానీ నష్టం చేసేలా ఉండవద్దని తెలిపారు. కరీంనగర్ ప్రెస్ భవనంలో సోమవారం సంఘం జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో చంద్రకుమార్ మాట్లాడారు. రైతుల సంక్షేమ కోసం వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్ఎస్ స్వామినాథన్ సిపార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని ఆవేదన చెందారు. పంటలకు మద్దతు ధర నిర్ణయించే అధికారం రైతులకే అప్పగించాలన్నారు. వ్యవసాయ రంగం లో రసాయనాల వాడకం పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో వర్ణ వెంకటరెడ్డి, దేవయ్య పాల్గొన్నారు.