హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణం, చార్మినార్ గుర్తులను తీసివేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదని ఉద్యమకారుడు, కార్మిక నేత పినపాక ప్రభాకర్ పేర్కొన్నారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు, చారిత్రక కట్టడాలు, దేవాలయాల ఘన చరిత్ర, పాలనా వైభవాన్ని చూడాలే కానీ ప్రభుత్వం రాచరికమని పేర్కొనడం సరికాదని సూచించారు. హైదరాబాద్ అంటేనే చార్మినార్ గుర్తుకొస్తుందని, చార్సౌసాల్ షహ ర్ అని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్‌కి ఇప్పు డేం వచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలు ఎప్పడూ ప్రజామోదయోగ్యంగా ఉండాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాడు మేధావులతో చర్చించి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ మట్టి బిడ్డ ఏలె లక్ష్మణ్‌తో పలు రకాల తెలంగాణ రాష్ట్ర చిహ్నాలను గీయించారు. అందులో అత్యుత్తమంగా పేరొనదగిన దాన్ని అందరి చేత ఆమోదం పొందిన అనంతరం అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వ రాజముద్రగా ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వం మిడిమిడిజ్ఞానంతో కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలగించడం తెలివితకువ తనానికి నిదర్శనం. తెలంగాణ ప్రతి మట్టి రేణువులోనూ శబ్దం, ధ్వని ఉంటుంది. పండితుల నుంచి పాలపిట్ట వరకు అందరిలోనూ సంగీతం ఇమిడి ఉంటుంది. అటువంటి బాణీ ల సొగసుకు అందాన్ని అద్దగలిగిన సంగీత దర్శకులు ఎందరో ఈ గడ్డ మీద ఉన్నా వాళ్లందరినీ పకనపెట్టి.. జై తెలంగాణ అనమంటే నై తెలంగాణ అన్న వాళ్లకు బాధ్యత అప్పజెప్పడం ఆత్మాభిమానాన్ని నిలువునా హత్య చేసినంతటి ఘాతకం. ఇటువంటి చేష్టలను ఎవరూ హర్షించరు.
– బండారు శంకర్, కవి, రచయిత, నల్లగొండ
మేడ్చల్ కలెక్టరేట్, మే 30: సాంస్కృతిక వారసత్వ సంపదకు కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలని, వాటిని ఎలా తొలగిస్తారని బీఆర్ఎస్ నేత బందెల పరమేశ్ ప్రశ్నించారు. అమరవీరుల స్థూపానికి సంబంధించి తమకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని పేర్కొన్నారు. తెలంగాణ రాజముద్రలో మార్పులు తీసుకురావడాన్ని గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని తుడిచివేయాలని కాంగ్రెస్ కుట్ర పూరితంగా కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిత్రాలను రాజముద్ర నుంచి తొలగించడం సబబుకాదని సూచించారు.
మేడ్చల్, మే 30: రాష్ట్ర రాజముద్రలోని కాకతీ య కళాతోరణం, చార్మినార్ చిత్రాలను తొలగిస్తే తె లంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతింటాయని సాహితీవేత్త పడాల రఘురాం పేర్కొన్నారు. ఆనాటి అద్భుత శిల్పాకళా శైలికి అద్దంపట్టే తోరణాన్ని తొలగించడం సరికాదని సూచించారు. ఇలాంటి చర్యలతో ప్రజల మనోభావాలు దెబ్బతింటాయన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు.
అడ్డగుట్ట, మే 30: కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రను చెరిపివేసే కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ నగర సంయుక్త కార్యదర్శి గుండవేణి రాజేశ్‌గౌడ్(పెద్దన్న) గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. తెలంగాణ అస్థిత్వాలైన కాకతీయుల తోరణం, చార్మినార్ గుర్తులను తొలగించడమంటే తెలంగాణ ఆత్మపై దెబ్బ కొట్టడమేనని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఆలోచనలు మనవీయ కోణంలో ఉండాలి. అప్పుడే ప్రజల్లో ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అంశాల ప్రాధాన్యం తగ్గించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. సంస్కృతికి దర్పణం ఆనాటి చిహ్నాలు. వాటిని నేటి తరాలకు పరిచయం చేయడంతోపాటు కొత్త వాటిని అందరి ఆమోదంతో చేర్చి ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సృజనాత్మకంగా ఆలోచిస్తూ.. ప్రజల జీవన విధానంపై కేంద్రీకరణ చేస్తే అభివృద్ధి జరుగుతుంది. చారిత్రక అంశాలు, గేయాల్లో మార్పులు అనేది మంచి ఆలోచన కాదని భావిస్తున్నా. ప్రజల ఆసక్తి మేరకు పరిపాలన చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు బాధ్యతగా భావించాలి. అప్పుడే ఉద్యమాలు వృథా కాకుండా ఉంటాయి.
– వేణు సంకోజు, ప్రముఖ సాహితీవేత్త, దాశరథి అవార్డు గ్రహీత, నల్లగొండ