వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 13: వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దని వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. జీవో నంబర్ 55ను విరమించే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఆరో రోజైన శనివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
వర్సిటీ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. బయోడైవర్సిటీ పార్కుకు ర్యాలీగా వెళ్లారు. పాలు, నీళ్లతో కడిగి పసుపు కుంకుమతో చెట్లకు పూజలు చేశారు. అనంతరం వంటావార్పు, బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. వర్సిటీ పరిధిలోని ప్రధాన రహదారుల వెంట ర్యాలీ నిర్వహించారు. సేవ్ ద యూనివర్సిటీ ల్యాండ్స్, సేవ్ ఫార్మర్స్, స్టూడెంట్ పవర్ నేషనల్ పవర్ అంటూ నినాదాలు చేశారు. శాస్త్రవేత్తలు, ఉద్యోగులు.. విద్యార్థులకు మద్దతు తెలిపారు.
ప్రభుత్వం ఒంటెత్తు పోకడ కొనసాగిస్తుందని విమర్శించారు. వర్సిటీ పరిధిలో హైకోర్టు నిర్మించడం వల్ల పర్యావరణం, వ్యవసాయ పరిశోధనలు, జీవ వైవిధ్యానికి అపార నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మనస్సు మార్చాలని ప్రకృతిని వేడుకున్నారు. వారికి ఎక్స్ వేదిక ద్వారా వ్యవసాయ వర్సిటీ నాడు, నేడు, భవిష్యత్తు ప్రణాళికను పంపించారు. వారి మనస్సు మారి జీవో నంబర్ 55ని రద్దు చేయాలని వేడుకొన్నారు.
జీవరాశి మనుగడకు వర్సిటీ దోహదం
వ్యవసాయ వర్సిటీ అనేక జీవరాసులు, వివిధ రకాల చెట్లు, జీవరాశి మనుగడకు దోహద పడుతున్నదని పలువురు వర్సిటీ విద్యార్థులు అన్నారు. రాజధాని హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న వ్యవసాయ వర్సిటీ దేశంలో ఎక్కడాలేని ప్రాధాన్యాన్ని సంతరించుకుందని గుర్తుచేశారు. ఆరో రోజు నిరసనల్లో వర్సిటీ కళాశాల విద్యార్థి సంఘాల నాయకులు రాజ్ కుమార్, శ్రీజ, అరవింద్, మధూకర్, సత్యమూర్తి, సురేందర్, దీక్షిత్, భానుచందర్, హరిప్రియ, శిరీష, అరవింద్, వంశీచందర్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, శంకర్ నాయక్, రాకేశ్, ఆధ్వర్యంలో విద్యార్థులు వర్సిటీ ప్రధాన కార్యాలయం గేటు వద్ద బైఠాయించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.