మరికల్, మే 26: పేదింటి ఆడబిడ్డ పెండ్లికి దాతలు చేయూతనిచ్చారు. వాట్సాప్లో వచ్చిన విజ్ఞప్తికి స్పందించి రూ.లక్ష అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని బుడ్డెగానితండాకు చెందిన నీల్యానాయక్కు భార్య, కూతురు నందిని ఉన్నారు. భార్య గతంలోనే మృతిచెందగా, గత నెలలో నీల్యానాయక్ సైతం అనారోగ్యంతో చనిపోయాడు. నిరుపేద కుటుంబానికి చెందిన నీల్యానాయక్ చనిపోయిన సమయంలో అంత్యక్రియలు సైతం విరాళాలతో నిర్వహించారు. అనాథగా మారిన నందినికి గ్రామ ప్రజాప్రతినిధులే పెద్దలై పెండ్లి చేసేందుకు నిర్ణయించారు. ఆమె వివాహానికి సాయం చేయాలని సర్పంచ్ రాములునాయక్, ఉప సర్పంచ్ భాస్కర్నాయక్ వాట్సాప్లో కోరారు. స్పందించిన పలువురు రూ.లక్ష జమచేశారు. గురువారం వివాహ సమయంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ మొత్తాన్ని పెండ్లికూతురుకు అందచేశారు. పేద కుటుంబానికి చేయూతనిచ్చి సహాయం చేసిన వాట్సప్ గ్రూప్ సభ్యులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.