కోటపల్లి, నవంబర్ 6 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం గ్రా మానికి చెందిన నిరుపేద విద్యార్థిని రవీణ ఎంబీబీఎస్ చదువుకు ఆసరాగా ఉంటామంటూ దాతలు ముందుకువస్తున్నారు. రవీణ ఇటీవల నిర్వహించిన నీట్లో 454 మార్కులు (ర్యాంక్ :1,22,364) తెచ్చుకొని, మహబూబ్‌నగర్‌లోని ప్రభు త్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. చదువుకునే స్థోమత లేకపోవడంతో శనివారం ‘నమస్తే తెలంగాణ’ జిల్లా సంచికలో ‘వైద్య విద్యకు సాయమందించరూ’ శీర్షికన కథనం ప్రచురితమైంది.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తోపాటు పలువురు దాతలు సాయమందించారు. విప్ సుమన్ రూ.లక్ష చెక్కు అం దించగా, ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ వెల్డన్ సుమన్ అంటూ ప్రశంసించారు. మిగతా దాతల నుంచి మరో 1,07,600 సమకూరాయి. తాజాగా ఆదివారం ఏపీలోని గుంటూరుకు చెందిన శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గళ్లా రామచంద్రరావు కూడా స్పందించారు. రవీణ వైద్యవిద్య పూర్తయ్యే వరకు ఖర్చు లు మొత్తం భరిస్తామని అభయమిచ్చా రు. ఆ సంస్థ ప్రతినిధులు విద్యార్థిని రవీణను సన్మానించారు.