హనుమకొండ, జనవరి 21: వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని గట్టుకింద పల్లి గ్రామ శివారు తాడిచెట్లగుట్టపై డోల్మెన్ సమాధులు వెలుగు చూశాయని ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు, ఏకో ట్రావెలర్ ప్రతాప్ తెలిపారు. క్షేత్ర పర్యటనలో భాగంగా తన అన్వేషణలో గట్టుకిందపల్లిలోని రెండు గుట్టలపై ఒకొక్కటి చొప్పున డోల్మెన్ సమాధులు, గుట్ట దిగువన రాక్షస గూళ్లను గుర్తించినట్టు పేర్కొన్నారు.
ఈ సమాధులు 3 వేల ఏండ్ల కిందటివని హనుమకొండ జిల్లా పురావస్తు చరిత్ర వ్యాసకర్త, పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డితెలిపారు. బృహద్ శిలా యుగానికి చెందిన ఆదిమ మానవులు మరణించిన వారికి గుర్తుగా ఇలాంటి నిర్మాణాలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. పురావస్తు చారిత్రక ఆధారాలను గ్రామస్థులు పరిరక్షించుకోవాలని వారు సూచించారు.