తాండూరు, మే 14: వికారాబాద్ జిల్లా తాండూరులో మంగళవారం దారుణం జరిగింది. నిద్రిస్తున్న 5 నెలల పసిబాలుడిపై కుక్క దాడి చేసింది. తీవ్ర గాయాలతో బాలుడు మృతిచెందాడు. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం దుప్పల్లికి చెందిన దత్తు, లావణ్య దంపతులు తమ కుమారుడు సాయినాథ్ (5 నెలలు)తో కలిసి తాండూరు పట్టణ సమీపంలోని నాగభూషణం పాలిషింగ్ యూనిట్లలో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. మంగళవారం బాలుడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తండ్రి పాలిషింగ్ యూనిట్లో పని చేస్తుండగా.. తల్లి లావణ్య పనిమీద బయటకెళ్లింది. నిత్యం పాలిషింగ్ యూనిట్లలో ఉండే ఓ యజమాని పెంపుడు కుక్క నిద్రిస్తున్న పసి బాలుడిపై దాడి చేసింది. బాలుడి ఏడుపు విన్న కుటుంబ సభ్యులు బాలుడి దగ్గరకు వచ్చి చూడగా తీవ్ర గాయాలతో మృతిచెంది ఉన్నాడు. ఆగ్రహానికి గురైన స్థానికులు కుక్కను కొట్టి చంపారు. తమ పసిబాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ సంఘటనను చూసిన స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.