హైదరాబాద్, ఆగస్టు17 (నమస్తే తెలంగాణ) : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు కదం తొక్కారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపు మేరకు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో శనివారం ఓపీ సేవలు బంద్ చేశారు.
వైద్య విద్యార్థులు, హౌస్సర్జన్లు భారీ ర్యాలీలు తీశారు. హైదరాబాద్ ధర్నాచౌక్‌లో ఐఎంఏ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ఘటనకు బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో డ్యూటీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. పార్టీలకతీతంగా ప్రతిఒక్కరూ ఈ ఘటనను ఖండిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కఠినంగా వ్యవహరించి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్యుల ధర్నాలకు వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు, కార్యదర్శి కుమార్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నిర్లక్ష్యం వహిస్తూ హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని పేర్కొన్నారు.