హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): కేవలం 540 గ్రాముల బరువున్న పాపకు 80 రోజులపాటు చికిత్స అందించి ప్రాణం పోశారు కిమ్స్ కడల్స్ దవాఖాన వైద్యులు. హైదరాబాద్కు చెందిన మర్రి భాగ్యమ్మ (47), రాజశేఖర్ (55) దపంతులు ఇద్దరూ మూగవారే. ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం దాల్చిన భాగ్యమ్మకు కవలలు పుట్టబోతున్నట్టు పరీక్షల్లో తేలింది. భాగ్యమ్మకు తీవ్ర రక్తపోటు, మధుమేహం, గర్భాశయానికి తగినంతగా రక్తం సరఫరా కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఏడు నెలలు నిండగానే ప్రసవం జరిగింది.
కవల పిల్లల్లో బాబు మరణించాడు. బతికి ఉన్న పాప కేవలం 540 గ్రాములు ఉంటడం తో వైద్యులు ఎన్ఐసీయూలో చికిత్స అందించారు. 63 రోజులు హైప్లో నాసల్ ఆక్సిజన్ పెట్టారు. ఏడుగురు వైద్యులు, తొమ్మిది మంది నర్సులు సైగల భాష నేర్చుకొని చికిత్స, పరీక్షలు, వాటి ఫలితాలు, పాప ఎలా ఉందన్న విషయాలను తల్లిదండ్రులకు వివరించారు. 80 రోజులపాటు మెరుగైన చికిత్స అందించడంతో పాప బరువు 1,642 గ్రాములకు చేరడంతో మంగళవారం డిశ్చార్జి చేశారు. మెరుగైన చికిత్స అందించిన వైద్యుల బృందానికి రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.