హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): పిల్లల్లో దగ్గు నివారణకు కోల్డ్రిఫ్ (పారాసిటమల్, ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్, క్లోర్‌ఫెనిరమిన్ మలేట్) సిరప్‌ను (Coldrif Syrup) వాడొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఈ సిరప్ తాగి 11 మంది చిన్నారులు మృతి చెందడంతో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శనివారం ఈ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు కాంచిపురం జిల్లా సుంగువచతిరంలోని శ్రేసన్ ఫార్మా కంపెనీలో తయారైన ఎస్ఆర్ 13 బ్యాచ్ నంబర్ కోల్డ్రిఫ్ సిరప్‌లో డైఇథిలీన్ ైగ్లెకాల్ (DEG) అనే విషపూరిత పదార్థాలు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది.
ఇప్పటికే ఎవరైనా ఈ సిరప్‌ను కలిగి ఉన్నట్టయితే వెంటనే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించింది. ప్రస్తుతం తెలంగాణలో రిటైలర్లు, హోల్‌సేలర్లు, దవాఖానాల్లో ఉన్న ఎస్ఆర్ 13 బ్యాచ్ నంబర్ కోల్డ్రిఫ్ సిరప్‌ను ఫ్రీజ్ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లను ఆదేశించింది. కాగా, ఐదేండ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులకు దగ్గు సిరప్‌లను సిఫారసు చేయవద్దని, ఐదేండ్ల కంటే ఎక్కువ వయసున్న చిన్నారులకు సైతం తగిన మోతాదులో మందులు సిఫారసు చేయాలని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వైద్యులకు సూచించింది.