హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 అధికారుల చేతికి ప్రభుత్వ దవాఖానాల పాలన బాధ్యతలు ఇవ్వొద్దని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి జనార్దన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఇతర రాష్ర్టాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
రోగుల మానసిక, శారీరక అవసరాలు తెలిసిన వారైతేనే పాలనను సమర్ధంగా నిర్వహించగలరని సూచించారు. గ్రూప్-1 అధికారుల చేతికి దవాఖానాల పాలన అప్పగించడం అంటే డాక్టర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై పునరాలోచించాలని కోరారు.