హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల నుంచి కాలేజీలు ట్యూషన్ ఫీజులు వసూ లు చేయవద్దని తెలంగాణ ఉన్నత విద్యామండలి స్పష్టంచేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దని మండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనల ప్రకారం రెండు లక్షలలోపు ఆదాయ ధ్రువీకరణ పత్రమున్న వారి నుంచి కాలేజీలు ఎలాంటి ఫీజులు వసూ లు చేయవద్దు.
కానీ కాలేజీలు విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇదే విషయంపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమయ్యింది. ఫీజులు వసూలు చేయడాన్ని నిరసి స్తూ ఏబీవీపీ నేతలు, ఓయూ జేఏసీ విద్యార్థులు ఉన్నత విద్యామండలిని ముట్టడించారు. దీంతో ఉన్నత విద్యామండలి స్పందించింది. ఫీజురీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారి నుంచి ట్యూషన్ ఫీజులు వసూలు చేయవద్దని శ్రీరాం వెంకటేశ్ సూచించారు. అన్ని వర్సిటీల రిజిస్ట్రార్లు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.