హైదరాబాద్, ఏప్రిల్23 (నమస్తే తెలంగాణ): తుంగభద్ర కింద బచావత్ ట్రిబ్యునల్ చేసిన నీటి కేటాయింపులను మార్చవద్దని, ఆ అధికారం ప్రస్తుత ట్రిబ్యునల్‌కు లేదని ఆంధ్రప్రదేశ్ వాదించింది. ఈ మేరకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట గురువారం తన వాదనలు వినిపించింది. సెక్షన్-3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై ట్రిబ్యునల్ విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
అందుకు సంబంధించిన వాదనలు గురువారం ఢిల్లీలో ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేశ్‌కుమార్ ఎదుట కొనసాగాయి. బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర లెఫ్ట్ కెనాల్‌కు 29.5 టీఎంసీలు, హైలెవెల్ కెనాల్‌కు 32.5 టీఎంసీలు కేటాయించిందని, ఆ కోటాను మార్చే అధికారం ప్రస్తుత ట్రిబ్యునల్‌కు లేదని ఏపీ పేర్కొన్నది. తుంగభధ్ర నీటి కేటాయింపులపై తెలంగాణ చేసిన వాదనలు, ప్రతిపాదలను ఖండించింది. తమకు అవసరాలున్న మేరకు నీళ్లు ఇవ్వాల్సిందేనని, తగ్గించడానికి వీల్లేదని వాదించింది. శుక్రవారం కూడా విచారణ కొనసాగుతుంది.