వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 22: కొంత కాలంగా డైబ్యాక్ ఫంగస్ అనే వ్యాధితో వాడిన వేప, ప్రస్తుతం కోలుకొన్నదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రిసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వర్ తెలిపారు. వేప ఉత్పత్తుల వాడకంలో ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల ఐదు నెలలుగా దేశవ్యాప్తంగా వేప చిగుళ్లతోపాటు ఆకులు వాడి, చెట్టు ఎండి పోయినట్టుగా కనిపించడంతో ప్రజలు దిగులు చెందారు. పొద్దున్నే నోటి శుభ్రతతో పల్లె ప్రజల దిన చర్య ప్రారంభం నుంచి పంట చీడలను నివారించే వేప ఉత్పత్తులు నిలిచి పోయాయి. ఏడాది లోపు మొక్కలు ఎండి పోయాయి. ఇక చెట్టు నిలుస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్న సమయంలో రెండు నెలల క్రితం రిసెర్చ్ డైరెక్టర్ జగదీశ్వర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పర్యటించి పరిశోధనలు చేసింది. వేప చెట్లు అనతి కాలంలోనే కోలుకొంటాయని, ఎలాంటి మందులు పిచికారి చేయాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది. తమ బృందం చెప్పినట్టుగానే ఉగాదికి ముందుగానే వేప చెట్లు కోలుకోవడంతోపాటు ఆకులు, పూత, పుల్లలు తాజాగా ఆరోగ్యంగా ఉన్నాయని జగదీశ్వర్ వివరించారు. గతంలో లాగే వేప ఉత్పత్తులను ఎలాంటి సందేహం లేకుండా వాడుకోవచ్చని చెప్పారు.