ములుగు : అగ్నిప్రమాదం రూపంలో దేవుడు మీకు అన్యాయం చేసినా రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాల అండగా నిలుస్తూ న్యాయం చేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం జిల్లాలోని మంగపేట మండలం శనిగకుంటను సందర్శించి అగ్ని ప్రమాద బాధితులకు ధైర్యాన్ని కల్పించారు. సర్వం కోల్పోయి దు:ఖిస్తున్న మహిళలు, పిల్లలను అమ్మలా అక్కున చేర్చుకుని ఓదార్చారు. ఏడవాల్సిన అవసరం లేదని ఊరడించారు.
కాలిపోయిన గుడిసె, గుడిసె ప్రాంతానికి వెళ్లి ఆ కుటుంబ బాధలు విన్నారు. ఇంత అన్యాయం జరిగినందుకు అంతకు మించిన మేలు చేస్తామని ధైర్యం కల్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో అధైర్యాన్ని వీడి, ధైర్యంగా ఉండాలని, మీకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వారికి కావాల్సిన వంట సామగ్రి, నిత్యావసరాలు అందించారు.
గిరిజన సంక్షేమ శాఖ నుంచి నస్టపోయిన ప్రతి కుటుంబానికి 25వేల రూపాయలు, రెవెన్యూ శాఖ నుంచి 15 వేల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నామన్నారు. అదేవిధంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రతి మహిళకు, పిల్లలందరకీ 10వేల రూపాయల చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్థిక సాయాన్ని ప్రత్యేకంగా అందిస్తున్నామన్నారు. వీటితో పాటు తాత్కాలిక వసతుల కోసం వెంటనే ఒక్కో దానికి దాదాపు 7వేల రూపాయల చొప్పున షెల్టర్లు ఏర్పాటు చేశామని, ఉండడానికి కావల్సిన వసతులు, భోజనం అందిస్తున్నామన్నారు.
బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టుకునేందుకు త్వరలోనే 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా అందుతుందని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వస్తాయన్నారు. సత్య సాయి ట్రస్ట్ , ప్యూర్ సంస్థ ముందుకు వచ్చి బాధితులకు నిత్యావసరాలు ఇస్తున్నందుకు ధన్యవాదాలుతెలిపారు.
ఐటిడీఏ నుంచి పరుపులు, చీరలు, దోతులు, బెడ్ షీట్లు, మెత్తలు, అవసరమైన ఇతర సామగ్రిని బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు ఉన్నారు.