బెంగళూరు, జనవరి 8: తెలంగాణలో కరోనా కట్టడికి సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించినప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష పేరుతో నానా హంగామా చేశారు. అదే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ పాదయాత్ర చేస్తానంటే సీఎం బొమ్మై వద్దంటున్నారు. ప్రజల ఆరోగ్యం అంటే పట్టింపు లేదా అని ప్రశ్నిస్తున్నారు. కరోనా విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరికి ఇదే తార్కాణం. కర్ణాటకలో కాంగ్రెస్ ఆదివారం నుంచి పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. అయితే బొమ్మై సర్కారు వీకెండ్ లాక్డౌన్ ప్రకటించింది. దీనిపై కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొవిడ్ లేదని, ప్రజల ను బయపెట్టేందుకు, తమ పాదయాత్ర అడ్డుకునేందుకు బీజేపీ సర్కారు ఆడుతున్న నాటకం ఇది అని విమర్శించారు. ‘ఇది కొవిడ్ కోసం ఉద్దేశించిన కర్ఫ్యూ కాదు. బీజేపీ కర్ఫ్యూ’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ పాదయాత్ర నిర్ణయంపై బొమ్మై మాట్లాడుతూ ‘కొవిడ్ రూల్స్ అనేవి ప్రజల కోసం తీసుకువచ్చినవి. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ లేకపోతే వారు ప్రతిపక్షంలో ఉండటానికి అనర్హులు’ అని అన్నారు. మరి తెలంగాణలో కూడా కొవిడ్ రూల్స్ ప్రజల కోసం తీసుకువచ్చినవే. ఇక్కడ రూల్స్ పాటించకుండా రాజకీయం కోసం దీక్షల పేరుతో కరోనా వ్యాప్తికి కారణమైతే వీరికి కూడా ప్రజలపై శ్రద్ధ లేనట్టే కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.