వనపర్తి : దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం పాత కలెక్టరేట్ ఆఫీస్లో ఏర్పాటుచేసిన సదరం క్యాంపును మంత్రి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులకు అవసరమైన పరికరాలను ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. దివ్యాంగులు స్టీఫెన్ హాకింగ్ నోబెల్ బహుమతి సాధించాడని అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి సూచించారు.
దివ్యాంగులకు ప్రతి నెలకు రూ. 3,016 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్లో దివ్యాంగులకు ఉచిత కోచింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్యాంపు ద్వారా ఎంపిక కాబడిన దివ్యాంగులకు రెండు నెలల్లో సర్టిఫికెట్లు, పరికరాలు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆశిష్ సంగవాన్, వేణు గోపాల్ జడ్పీ చైర్మన్ లోకినాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎంపీపీ కిచ్చ రెడ్డి, కోళ్ల వెంకటేష్, జిల్లా సంక్షేమ అధికారి పుష్పలత, డీఆర్డీఏ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.