హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): చాలీచాలని జీతంతో జీవితాలను నెట్టుకొస్తున్న హోంగార్డుల వేతనాల నిధులను ప్రభుత్వం దారి మళ్లించినట్టు తెలుస్తున్నది. ఎనిమిది జిల్లాల హోంగార్డుల జీతాల డబ్బులు రూ.7.8 కోట్లను ఇతర ఖర్చుల కోసం వెచ్చించినట్టు విశ్వసనీయ సమాచారం. మరోవైపు తమకు సమయానికి వేతనం చెల్లించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నదని హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రతినెలా జీతాల చెల్లింపులో ఆలస్యం చేస్తున్న రేవంత్రెడ్డి సర్కార్.. ఈ నెల 18 రోజులు గడిచినా 8 జిల్లాల్లోని 2,600 మంది హోంగార్డులకు జీతాలు ఇవ్వలేదని చెప్తున్నారు.
జీతాలు అందక, కుటుంబం గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రతినెలా చెక్ బౌన్సులు అవుతున్నాయని, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె కూడా కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఉన్నతాధికారులను అడిగితే.. ‘జీతాలు ఇప్పట్లోరావు, అవసరాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి. ప్రభుత్వం దగ్గర ఆర్థిక లోటు ఉంది. జీతాలు వచ్చినప్పుడు వస్తాయిలే’ అని సమాధానం చెప్తున్నారని వాపోతున్నారు. ఈ విషయంపై పోలీసుశాఖ ఉన్నతాధికారులను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా ఆర్థికశాఖ వద్ద నిధులు పెండింగ్లో ఉన్నాయని, ఎప్పుడు క్లియర్ అవుతాయో చెప్పలేమని పేర్కొన్నారు. రామగుండం, వరంగల్ కమిషనరేట్లు, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాలకు నిధులు మంజూరు కాలేదని వివరించారు.