వికారాబాద్, జూన్ 5 : వికారాబాద్ జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ అనంతగిరిలో అటవీ శాఖ అద్వర్యంలో ఎండింగ్ ప్లాస్టిక్ పోల్యుషన్ (Ending Plastic Polution )కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ అనేది నిత్య జీవితంలో భాగమై చివరకు మన ఆహరంలో మాక్రో ప్లాస్టిక్ రూపం లో చేరుతుందన్నారు. అది మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ ప్లాస్టిక్ రహిత జీవన విధానంలోకి మారాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని, మొక్కలు నాటడం, పెంచడం జీవిత చర్యల్లో భాగం కావాలన్నారు. కాలుష్య, ప్లాస్టిక్ రహిత జిల్లా గా ఏర్పాటు చేయాలనీ, సమాజంలోని ప్రతి వ్యక్తి పర్యావరణాన్ని కాపాడుతానని ప్రతిజ్ఞ బూనాలన్నారు. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించేందుకు మొక్కలు నాటి, వాటిని పెంచి కాపాడాలని పిలుపునిచ్చారు. త్వరలో అనంతగిరి ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మారుస్తామన్నారు.
అనంతగిరి అర్బన్ పార్క్ లో జరిగే అభివృద్ధి పనులను కలెక్టర్ ఈ సందర్బంగా పరిశీలించారు. పనులు తొందరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి జ్ఞానేశ్వర్, అటవీ రేంజ్ ఆఫీసర్ శ్యామ్ కుమార్, రాజేందర్, ప్రతిమ, అటవీ సెక్షన్ అధికారి అరుణ, ఉద్యాన్ కేర్ స్వచ్చంద సమస్త నిర్వాహకులు, విద్యార్థినులు, సత్య సాయి సేవా ట్రస్ట్ వారు పాల్గొన్నారు.