భూపాలపల్లి టౌన్, ఏప్రిల్ 23: దళితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడులో శనివారం 40 మంది దళితులకు రూ.3.44 కోట్ల విలువైన 49.31 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. దళితబంధు కార్యక్రమంలో లబ్ధిదారులందరూ ఒకే యూనిట్ తీసుకోవద్దని కోరారు. పౌల్ట్రీ, కూరగాయల సాగు వంటి లాభదాయక యూనిట్లు ఎంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. దళిత వర్గాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే గండ్ర చెప్పారు. అనంతరం కులాంతర వివాహాలు చేసుకున్న ఐదు జంటలకు ప్రోత్సాహక నగదు బాండ్లు అందజేశారు. ఇటీవల జరిగిన యూపీఎస్సీ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు అర్హత పొందిన గొర్లవీడుకు చెందిన కంకణాల రాహుల్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, కలెక్టర్ భవేశ్‌మిశ్రా పాల్గొన్నారు.