ఇల్లెందు రూరల్, ఆగస్టు 2: అటవీ అధికారుల తీరును నిరసిస్తూ ఓరైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం పూబెల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పూబెల్లి గ్రామానికి చెందిన మొక్క రమేశ్ పోడు భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. మూడ్రోజుల క్రితం ఫారెస్టు అధికారులు అక్కడికి వచ్చి పోడు సాగు చేయొద్దని రమేశ్‌ను హెచ్చరించి వెళ్లారు. శనివారం మరోమారు ఫారెస్టు అధికారులు వచ్చి బెదిరించడంతో మనస్తాపానికి గురైన రమేశ్ పురుగు మందు తాగాడు. స్థానికులు వెంటనే రమేశ్‌ను ఇల్లెందు ప్రభుత్వ దవాఖానకు తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం దవాఖానలో చేర్పించారు.
పలుమార్లు హెచ్చరించాం..
రమేశ్ తన సొంత భూమిలో వ్యవసాయం చేస్తూనే మూడ్రోజుల క్రితం అటవీశాఖ పరిధిలోని భూమిని ఆక్రమించుకునేందుకు పోడు చేస్తున్నాడు. ఇదే విషయమై అదే రోజు అతడిని మందలించాం. శనివారం సైతం మళ్లీ అటవీ భూమిని పోడు చేస్తుండటంతో అడ్డుకున్నాం. దీంతో పురుగుల మందు తాగాడు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం నేరం. భూములు కబ్జా చేస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవు.
– ఎస్ చలపతి, ఫారెస్టు రేంజర్