విజయపుర, ఫిబ్రవరి 3: కర్ణాటక బీజేపీ శాఖలో కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. తా ను, మరికొందరు ‘విధేయులైన’ పార్టీ నాయకులు మంగళవారం న్యూఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధిష్ఠానానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర, అతడి తండ్రి యెడియూరప్పపై ఫిర్యాదు చేయనున్నట్టు ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సోమవారం వెల్లడించారు. విజయేంద్ర, ఆయన కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని యత్నాల్ ఆరోపించారు. పాలక పక్షం కాంగ్రెస్తో విజయేంద్ర సర్దుబాటు రాజకీయాలు చేసుకున్నారని దుయ్యబట్టారు. బంధుప్రీతికి, కుటుంబ వారసత్వానికి బీజేపీ చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
‘మీకు అవినీతి కుటుంబం కావాలా లేదా విధేయులు, నిజాయితీపరులైన పార్టీ కార్యకర్తలు కావాలా? హిందుత్వను అనుసరించేవారికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలి’ అని ఆయన బీజేపీ అధిష్ఠానాన్ని కోరారు. అవినీతి కుటుంబాన్ని దూరంగా పెట్టడం, కుటుంబ పాలనను పార్టీలో నిరోధించడం, హిందూయేతర నాయకత్వం పార్టీకి అవసరం లేదని చెప్పడం అనే 3 ముఖ్యాంశాలను పార్టీ పెద్దల దగ్గర తాను ప్రస్తావిస్తానని యత్నాల్ మీడియాకు తెలిపారు. గతంలో తటస్థంగా ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు తనకు మద్దతు ఇస్తున్నారని వెల్లడించారు. పోక్సో, ఫోర్జరీ కేసులను చూపెట్టి కాంగ్రెస్ పార్టీ విజయేంద్రను భయపెడుతున్నదని యత్నాల్ చెప్పారు. మరోవైపు తిరిగి తనకే పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని విజయేంద్ర ధీమా వ్యక్తం చేశారు. యత్నాల్ స్పందిస్తూ పదవిలో తిరిగి వస్తానని ఎవరైనా ప్రకటిస్తారన్నారు.