BJP Nalgonda | నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుని ఎన్నిక ఆ పార్టీలో ముసలం పుట్టించింది. బీజేపీ నల్లగొండ జిల్లా పార్టీశాఖ అధ్యక్షులుగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిని మరోసారి నియమించారు. దీన్ని పార్టీలోని కొందరు సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో నల్లగొండలో అసమ్మతి సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితిల్లోనూ అధ్యక్షుడ్ని మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
మండల పార్టీ నాయకులు, జిల్లా నాయకులు అభిప్రాయం తీసుకోకుండానే పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకం చేయడం సరైన పద్ధతి కాదని బీజేపీ అసమ్మతి నేతలు బండారు ప్రసాద్, పొతేపాక సాంబయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం తమ వర్గం నేతలతో బండారు ప్రసాద్ తన ఇంట్లో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం పునరాలోచన చేయాలని కోరారు.
పార్టీ అధ్యక్షుడి మార్పు జరిగేవరకు బీజేపీ ఆఫీసు మెట్లెక్కబోమని బండారు ప్రసాద్ స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయం కోసం వేచి చూస్తామని, పార్టీ నాయకత్వం పట్టించుకోకపోతే తాము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఆ పరిస్థితి రాకుండా పార్టీ రాష్ట్ర నాయకత్వం చూడాలని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అర్ధరాత్రి నియామకం జరిగిందని, మెజార్టీ పార్టీ కార్యకర్తల అభిప్రాయం తీసుకోలేదని ఆరోపించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం నల్లగొండ జిల్లా అధ్యక్ష నియామకంలో పునరాలోచన చేయాలని అన్నారు.
సీనియర్ కార్యకర్తలను పక్కనపెట్టి పార్టీని భ్రష్టు పట్టిస్తున్న నాయకునికి బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి ఎలా కట్టబెడతారని బండారు ప్రసాద్ ప్రశ్నించారు. తనతో కలిసి రాకపోతే ప్రస్తుత కౌన్సిలర్లతోపాటు కౌన్సిలర్ టికెట్ ఆశిస్తున్న వారిని టికెట్ కట్ చేస్తానని బెదిరిస్తూ పార్టీకి నష్టం చేసే చర్యలు చేపడుతున్నాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తి అధ్యక్షుడిగా కొనసాగితే ఇప్పుడిప్పుడే జిల్లాలో పుంజుకుంటున్న పార్టీ జిల్లాలో అధోగతి పాలు కావడం ఖాయమన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను విస్మరించే జిల్లా అధ్యక్షుడి నియామకం విషయంలో రాష్ట్ర నాయకత్వం పునరాలోచన చేయాలని కోరారు.
ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కంకణాల నాగిరెడ్డి, దాసరి సాయి, వంగూరు రాఖి, గుర్రం వెంకన్న, రావిరాల వెంకటేశ్వర్లు, గడ్డం వెంకట్ రెడ్డి, వినయ్ కుమార్ ఈశ్వర్, బద్దం నగేష్, అక్కినపల్లి బలరాం, బొజ్జ నాగరాజు, మధు, పెరిక నరసింహ, పెరిక ముని కుమార్, ముత్యాల శంకర్ రెడ్డి,పవన్, ఏరుకొండ హరి, సముద్రాల వెంకట్, ప్రసాద్ బిక్షం తదితరులు పాల్గొన్నారు.