ఆదిలాబాద్, జూన్ 26(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా అధికారులు, ఎమ్మెల్యే ల సమావేశంలో ఆసిఫాబాద్ ఎమ్మె ల్యే కోవ లక్ష్మికి అగౌరవం ఎదురైంది. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వివేక్ వివిధ పథకాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశం లో మహిళా ఎమ్మెల్యేకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేదికపై కూర్చోవడానికి ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు చివరి సీటు కేటాయించారు. వేదికపైకి రావడానికి, దిగడానికి పోయేదారిలో ఈ కుర్చీ ఉండటంతో ఎమ్మెల్యే ఇబ్బందులు పడాల్సివచ్చింది.
దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే వేదిక దిగి, అధికారులకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వేదిక పైనుంచి దిగి కోవ లక్ష్మి వద్దకు వచ్చి తన సీట్లో కూర్చోవాల్సిందిగా కోరడంతో ఆమె ఆ సీట్లో కూర్చున్నారు. అనిల్ జాదవ్ వేదిక చివరి సీట్లో కుర్చొని సమావేశంలో పాల్గొన్నారు. బోథ్ ఎమ్మెల్యే తీరును పలువురు ప్రశంసించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలను చూడకుండా అందరికీ సమాన గౌరవం ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్చేశారు.