హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్నిగ్రామాల్లో పల్లెప్రగతి పనులు పూర్తిగా నిలిచిపోయాయని, కనీసం మురుగుకాల్వల్లో చెత్త సేకరణ పనులు కూడా సరిగా సాగడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విమర్శించారు. బుధవారం శాసనమండలిలో మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిలులపై జరిగిన చర్చలో వారు మాట్లాడారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు కలిసి కార్పొరేషన్ కానున్న నేపథ్యంలో అక్కడి సమస్యలను తీర్చాలని సభ దృష్టికి తెచ్చారు. అక్క డ 1/70 చట్టం ప్రకారం గిరిజనుల, గిరిజనేతరుల ఇండ్లస్థలాల క్రయ విక్రయాల విషయంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే గ్రామ పంచాయతీల ఏకాభిప్రాయంతో మున్సిపాలిటీలలో గ్రామాలను కలపాలని డిమాండ్ చేశా రు. విలీన గ్రామాలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరారు. కొత్తగూడెం పరిధిలోకి తేనున్న నాయకులగూడెం వంటి గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. చర్చలో శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారితోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, సత్యవతి రాథోడ్, దేశపతి శ్రీనివాస్, తాతా మధు. నవీన్‌కుమార్‌రెడ్డి, యాదవరెడ్డి, వెంకటరామిరెడ్డి, బండ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.