Divya Bharat | హైదరాబాద్ సిటీబ్యూరో/వేములవాడ, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ఆషాఢం వచ్చిందంటే సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు పెట్టింది పేరు. అటువంటి బోనాల పండుగ విశేషాలు ఆ పుస్తకంలో కనిపించవు. తెలంగాణవాసుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న వేములవాడ రాజన్న ఊసే ఆ పేజీల్లో కానరాదు. ఓరుగల్లు పురాధీశ్వరి భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్రమోదీకి అమ్మవారు కనిపించినా నీతి ఆయోగ్ వారికి మాత్రం ఆ తల్లి కానరాలేదు. దేశంలోని పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించేందుకంటూ ‘దివ్యభారత్’ పేరిట నీతి ఆయోగ్ రూపొందించిన నివేదికలో తెలంగాణపై చూపిన వివక్షకు ఇది ప్రత్యక్ష నిదర్శనం.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇలాకాలో జరిగే బోనాల పండుగ విశేషాలు కానీ, కరీంనగర్ జిల్లా నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ సొంత ప్రాంతంలో కొలువుదీరిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి పేరుగానీ ఆ పుస్తకంలో లేకపోవడం ఏమిటని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేకతలున్న కొన్ని కేంద్రాలను నీతి ఆయోగ్ ఎంపికచేసి ‘దివ్యభారత్’ పేరిట పుస్తక రూపంలో ఈ నివేదికను విడుదల చేసింది.
పర్యాటక రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘లోన్లీ ప్లానెట్ ట్రావెల్బుక్’ తరహాలో ‘దివ్యభారత్’ను రూపొందించింది. అన్ని రాష్ర్టాల్లోని ప్రముఖ పర్యాటక స్థలాల వివరాలు, వాటి ప్రాధాన్యాన్ని దేశ, విదేశీ పర్యాటకులకు తెలియజేసేలా ‘దివ్యభారత్’ను అందుబాటులోకి తెచ్చింది. ఏ సమయాల్లో ఆ పర్యాటక కేంద్రాలను సందర్శిస్తే బాగుంటుందో కూడా వివరించింది. తెలంగాణను సందర్శించేందుకు అక్టోబర్-ఏప్రిల్ మధ్య కాలం అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నది. మొత్తం 498 పేజీలతో కూడిన ఈ నివేదికలో తెలంగాణకు కేవలం 7 పేజీలు కేటాయించింది.
రాష్ట్రంలోని హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు, ఫలక్‌నుమా ప్యాలెస్, అనంతగిరి కొండలు, మృగవని నేషనల్ పార్క్, గోల్కొండ, శామీర్‌పేట, మౌలాలీ కొండలు, చిలుకూరు బాలాజీ దేవాలయం, పాకాల, లక్నవరం చెరువులు, బొగత, పాండవుల గుట్ట, వేయిస్తంభాల గుడి, రామప్పదేవాలయం, కోటగుళ్లు తదితర పర్యాటక ప్రాంతాలను ఆధ్యాత్మిక, ప్రాకృతిక ప్రాధాన్యమున్న ప్రాంతాలుగా విభజించి ఈ పుస్తకంలో పొందుపరిచింది.
ఆధ్యాత్మిక ప్రదేశాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసరగుట్ట శివాలయం, భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, యాదగిరిగుట్టలోని నారసింహస్వామి దేవాలయం, నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతీ దేవాలయం, జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి దేవాలయాలకు మాత్రమే చోటు కల్పించింది. తెలంగాణకే ప్రత్యేకమైన బోనాల పండుగతోపాటు ఎంతో విశిష్టమైన మేడారం జాతర, నాగోబా జాతర, పీర్ల పండుగ, దక్కనీ పండుగ, లుంబినీ పండుగలను విస్మరించింది. వంటల విభాగంలో హైదరాబాదీ బిర్యానీ, సర్వపిండి, కోడికూర, పచ్చిపులుసు, జొన్నరొట్టె, కుబానీకా మీఠా, డబుల్కా మీఠా, హైదరాబాదీ హలీమ్, మిర్చికా సాలన్ మాత్రమే ఉన్నాయి.
ఏటా ఆషాఢమాసం రాగానే తెలంగాణలోని ప్రతి ఇల్లూ బోనాల సందడితో కళకళలాడుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే ఈ పండుగకు నీతి ఆయోగ్ ‘దివ్యభారత్’ పండుగలు, జాతరల విభాగంలో చోటు దక్కలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. నాటి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన ఈ పండుగ కేంద్ర ప్రభుత్వానికి కనిపించలేదా? అని తెలంగాణ వాసులు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తూ ఏటా జూలై, ఆగస్టులో ఎంతో ఘనంగా నిర్వహించుకునే బోనాల ఉత్సవాలకు ‘దివ్యభారత్’లో చోటు దక్కకపోవడంతో తెలంగాణపై ఇంత వివక్ష అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి దాదాపు వెయ్యేండ్ల చరిత్ర ఉన్నది. క్రీస్తు శకం 1083లో అంటే 943 సంవత్సరాల క్రితం కళ్యాణి చాళుక్య సామంతుల్లో ఒకరైన రాజాదిత్యుడు తన పేరిట రాజాదిత్యేశ్వర ఆలయాన్ని నిర్మించినట్టు ఆ ఆలయంలోని శాసనాలు వెల్లడిస్తున్నాయి. ఎంతో విశిష్టమైన ఈ ఆలయాన్ని తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ఏటా కోటిన్నర మందికిపైగా భక్తులు సందర్శించి రాజన్నకు మొకులు చెల్లించుకుంటారు. శివుడి వాహనం నందిగా భావించే కోడెను మొకు రూపంలో స్వామివారికి చెల్లించుకునే ఆనవాయితీ దక్షిణ భారతదేశంలో ఇకడ మాత్రమే ఉన్నది. ఈ ఆలయాన్ని కేంద్రం గుర్తించకపోవడం, ఆధ్యాత్మిక ప్రాంతాల జాబితాలో నీతి ఆయోగ్ చోటు కల్పించకపోవడంపై రాజన్న భక్తులతోపాటు యావత్ తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.