హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాల కేటాయింపులో తెలంగాణపై వివక్ష, రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రం ప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీని నిలదీశారు. కృష్ణా నదీ జలాల వివాదాల పరిష్కారానికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని లేదా ఇప్పుడున్న ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) నిబంధనలను సవరించాలనే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ తిరస్కరించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘ఎనిమిదేండ్లు గడుస్తున్నా.. తెలంగాణ రైతులకు కృష్ణా జలాల్లో సరైన వాటా అందించలేని ఎన్పీఏ (నిరర్ధక ఆస్తి) ప్రభుత్వం సిగ్గుపడాలి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే రాజకీయాలు చేయకూడదు. వెన్నెముక లేని రాష్ట్ర బీజేపీ ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తుందా? లేదా’ అంటూ కేటీఆర్ ట్విట్టర్లో ప్రశ్నించారు.
మండిపడ్డ నాయకులు.. నెటిజన్లు
కేటీఆర్ ట్వీట్‌పై టీఆర్ఎస్ నాయకులు, నెటిజన్లు స్పందించారు. ‘తెలంగాణ విషయంలో భారత ప్రభుత్వానికి ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు? వాళ్లు చేసిన వాగ్దానాల అమలులో ఎప్పుడో విఫలమయ్యారు. అర్థం లేని మాటలు మాట్లాడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి విషయాలను మాట్లాడే దమ్ము ఎందుకు లేదు’అని ఒకరు నిలదీశారు. ‘కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ, నీటిపారుదల విధానాలతో బంజరు భూములను అధిక ఉత్పాదకత కలిగిన వ్యవసాయ భూములుగా మార్చింది. తెలంగాణ రైతులను దేశంలోనే అత్యంత సంతోషకరమైన రైతులుగా చేసింది. ఇలాంటప్పుడు రాష్ట్ర డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం మద్దతును ఎందుకు అందించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిశాంక్, టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్ ప్రశ్నించారు. సిగ్గులేని బీజీపీ.. దమ్ములేని నాయకులు.. రాష్ట్ర సమస్యలపై మాట్లాడని బీజేపీ రాష్ర్టానికి పట్టిన శని.. అంటూ నెటిజన్లు ట్వీట్లు చేశారు.