అమీన్పూర్, నవంబర్ 24: కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా కార్యకర్తలు అత్యుత్సాహంతో టపాకాయలు పేల్చడంతో అపశ్రుతి చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు శుక్రవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. కొందరు కార్యకర్తలు టపాకాయలు పేల్చగా వాటి మిరుగులు అక్కడే ఉన్న ఎలక్ట్రికల్ షాప్లో పడటంతో మంటలు చెలరేగి భవనం పూర్తిగా దగ్ధమైంది. దీనిపై స్దానికులు, షాప్ యజమాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.