హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్‌లో (ఆర్డీఎస్ఎస్) చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరినట్టు డిస్కంలు తెలిపాయని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) వెల్లడించింది. ఇదే విషయాన్ని రిటైల్ సప్లయ్ బిజినెస్ కోసం దా ఖలు చేసిన పిటిషన్లో డిస్కంలు ప్రస్తావించినట్టు ఈఆర్సీ కార్యదర్శి బుధవారం ప్రకటించారు. తెలంగాణ డిస్కంలు ఆర్డీఎస్ఎస్లో చేరుతున్నాయని, ఆ విషయాన్ని ఈ ఆర్సీ చైర్మన్ ధ్రువీకరించారని వార్తలు రావడంతో విద్యుత్తు నియంత్రణమండలి పై విధంగా స్పందించింది.
ఇంకా డీపీఆర్ సమర్పించలేదు: ఎస్పీడీసీఎల్
ఆర్డీఎస్ఎస్లో చేరేందుకు తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ స్పష్టం చేసింది. ఈ స్కీమ్‌లో చేరేందుకు డిస్ట్రిబ్యూషన్ రిఫార్మ్స్ కమిటీ (డీఆర్సీ) ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖకు డీపీఆర్‌ను సమర్పించాల్సి ఉంటుందని, ఆ డీపీఆర్‌ను తామింకా సమర్పించలేదని టీజీఎస్పీడీసీఎల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్ చీఫ్ ఇంజినీర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.