హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హైటెన్షన్ (హెచ్‌టీ) విద్యుత్తు వినియోగదారుల బిల్లుల జారీలో విషయంలో డిస్కం అధికారులు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకూ మీటర్ రీడర్లు లేదా అధికారులు ప్రతి విద్యుత్తు కనెక్షన్ వద్దకు వెళ్లడం, రీడింగ్ తీయడం, ప్రింట్ తీయడం, వినియోగదారులకు ఇవ్వడం సహజంగా జరుగుతూ ఉండేంది. ఆ మేరకు బిల్లుల చెల్లింపు జరిగేది. ఇక నుంచి ఆటోమెటిక్‌గా బిల్లులను జారీచేసే నూతన విధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నారు.
ఈ నూతన మీటర్ రీడింగ్‌ను గ్రహించి ఆటోమెటిక్‌గా బిల్లును చూపిస్తుంది. ఈ బిల్లును నేరుగా సంబంధిత వినియోగదారు ఈ మెయిల్‌కు వెళ్తుంది. ఎమ్మార్ బిల్లుల జారీకోసం సబ్స్టేషన్లు, హెచ్‌టీ పరిశ్రమల్లో డిజిటల్ డేటాను అనలాగ్ సిగ్నళ్లుగా మార్చే మోడెమ్ ఉపకరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సాంకేతిక పరికరాల బిగింపు ప్రక్రియ దాదాపు పూర్తికావచ్చింది. ఇది పూర్తికాగానే ఈ నెల నుంచే ఆటోమెటిక్‌గా వినియోగదారులకు బిల్లులను జారీచేస్తారు. దీంతో ఇంజినీర్లకు బిల్లుల రీడింగ్ తిప్పలు తప్పనున్నది.
రాష్ట్రంలో 16 వేలకుపైగా హెచ్‌టీ విద్యుత్తు వినియోగదారులు ఉన్నారు. వీరిలో 14 వేల మంది దక్షిణ డిస్కం పరిధిలో, 2,000 మంది ఉత్తర డిస్కం పరిధిలో ఉన్నారు. ఇవన్నీ 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ కనెక్షన్లే. ఈ కనెక్షన్లకు బిల్లులను సాధారణ మీటర్ రీడర్లు తీయరు. హెచ్‌టీ బిల్లింగ్ బాధ్యత డిస్కం ఇంజినీర్లదే. ఇవి రూ.లక్షలు, రూ.కోట్లల్లో బిల్లులు కావడంతో అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్లు, డివిజినల్ ఇంజినీర్లు స్వయంగా మీటింగ్ రీడింగ్ తీసి, బిల్లులను జారీచేస్తారు.
వాస్తవంగా వీరు క్షేత్రస్థాయిలో విద్యుత్తు సరఫరాను పర్యవేక్షించడం, సమస్యలను పరిష్కరించే బాధ్యతలు చూస్తుంటారు. కానీ నెలలో 12-13 రోజులపాటు హెచ్‌టీ బిల్లుల జారీకే సమయం పోతున్నది. మిగతా పనులు పక్కదారి పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డిస్కం అధికారులు ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ (ఎమ్మార్) విధానాన్ని అమలు చేస్తున్నారు.