హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ( Budget ) లో జర్నలిస్టులకు మొండి చేయి చూపిందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ( TUWJ ) రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ( Allam Narayana) , ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ ( Maruti Sagar ) ఆరోపించారు. బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమ నిధి, ఇళ్ల స్థలాలు, హెల్త్ స్కీమ్ ముచ్చట అసలే లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
జర్నలిస్టులకు గత ప్రభుత్వంలో కంటే తాము అధికంగా సంక్షేమం కోసం నిధులు కేటాస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జర్నలిస్టులను పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో అదనంగా 100 కోట్లు సంక్షేమ నిధిని కేటాయిస్థానని చెప్పి ప్రస్తుత బడ్జెట్లో కూడా చిల్లి గవ్వ కేటాయించకపోవడం అన్యాయం అన్నారు.
ఇళ్ల స్థలాల ప్రస్తావన చేయకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని జర్నలిస్టుల సంఘాల నాయకులు పలుమార్లు కోరినా హెల్త్ కార్డు సంబంధించిన అంశమే బడ్జెట్ ప్రసంగంలో లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ తీరును పరిశీలిస్తే జర్నలిస్టులకు ఆరోగ్య భద్రతను అందించే జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్‌ను ఈ ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేసిందా అనే అనుమానం కలుగుతుందన్నారు.
ఇది తెలంగాణ జర్నలిస్టులకు పూర్తిగా అన్యాయం చేసిన బడ్జెట్ గా తాము భావిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్‌పై తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, టీయూడబ్ల్యూ జె కోశాధికారి యోగానంద్ బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.