ధర్మపురి, జూలై 17 : ‘ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నేను అర్హుడిని కాదా సారూ..’ అంటూ ఓ దివ్యాంగుడు గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీసీ అభినందన సభలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు మొరపెట్టుకున్నాడు. మంత్రితో దివ్యాంగుడి మాటలు.. ‘అయ్యా.. నాది గొల్లపెల్లి మండలం ఆత్మకూర్. పేరు అత్తెన రాజమల్లు. కూర్చోలేనంతగా వైకల్యం ఉంది. బెడ్‌షీట్‌లో ఇద్దరు వ్యక్తులు నన్ను తీసుకువెళ్లి రోడ్డు పక్కన పడుకోబెడితే అడుక్కుంటూ జీవిస్తున్నా. సొంత ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకున్నా లిస్టుల పేరు రాలేదు. అధికారులు, నాయకుల చుట్టూ తిరిగినా పట్టించుకుంటలేరు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హుడిని కానా సారూ.. దయచేసి ఇందిరమ్మ ఇల్లు, బ్యాటరీ సైకిల్ ఇప్పించండి’ అంటూ విన్నవించుకున్నాడు. దీంతో స్పందించిన మంత్రి వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
కన్నాయిగూడెం, జూలై 17 : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఫారెస్ట్ అధికారులు గురువారం నోటీసులు అందజేశారు. గూర్రేవులలో 17 మంది, కన్నాయిగూడెంలో ఇద్దరు, ఏటూరులో 11 మంది, చింతగూడెంలో నలుగురు చొప్పున మొత్తం 34 మంది వెంటనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆపివేయాలని, ఫారెస్ట్ అధికారుల నుంచి అనుమతి పొందిన తర్వాత ప్రారంభించాలని నోటీసులో పేర్కొన్నారు. ఎవరైనా ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నంబర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపడితే నోటీసులు అందిస్తామని నార్త్ రేంజ్ అధికారిణి అఫ్సరున్నీసా హెచ్చరించారు.