తొర్రూరు : తొర్రూరు, సెప్టెంబర్ 15 : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో దివ్యాంగులు నినాదాలు చేస్తూ పెన్షన్ పెంపు కోసం అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు.
అనంతరం తాహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి విచ్చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి వాహనానికి అడ్డు తిరిగి, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసి, దివ్యాంగులకు పెన్షన్ను వాగ్దానం చేసినట్లే రూ.4000 నుంచి రూ.6000కు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వృద్ధులకు, వితంతువులకు, ఇతర పెన్షన్ దారులకు రూ.2000 నుంచి రూ.4000, వికలాంగులకు రూ.4000 నుంచి రూ.6000 పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక 22 నెలలు గడిచినా ఇప్పటివరకు అమలు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు.
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలలుగా పెన్షన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా పెన్షన్ పెంచకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ రాష్ట్ర నాయకులు వెంకటరమణ, వీహెచ్పీఎస్ మహబూబాబాద్ జిల్లా అధికార ప్రతినిధి భూక్య వెంకన్న, వీహెచ్పీఎస్ తొర్రూరు మండల అధ్యక్షులు జెల్ల ఉపేందర్ ఎమ్మార్పీఎస్ తొర్రూరు మండల ఇన్చార్జ్ మంద యాకమల్లు, విహెచ్పిఎస్ నాయకులు ధర్మారపు విష్ణు, జాటోత్ సుమన్, మల్సూరు రేణుక, రమ యాకమ్మ, సుశీల, సోమ్లీ రాజమ్మ, అస్లీ, ఇతర పెన్షన్ దారులు పాల్గొన్నారు.