Nag Ashwin | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కు చెందిన 400 ఎకరాల భూములను రేవంత్రెడ్డి ప్రభుత్వం విక్రయిస్తుందన్న వార్తలపై ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అసహనం వ్యక్తంచేశారు. భూముల విక్రయానికి సంబంధించిన వార్తను షేర్ చేసిన ఆయన ‘మన ఖర్మ ..ఏమీ చేయలేం’ అని వ్యాఖ్యానించారు. హెచ్సీయూలో వృక్షసంపద, అరుదైన వన్యప్రాణులు, పక్షిజాతులు నివాసమున్నాయి.
ఈ విషయమై హైదరాబాద్లో మంగళవారం జరిగిన ఓ ప్రెస్మీట్లో పాల్గొన్న నాగ్అశ్విన్ స్పందించారు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ గురించి ఓ విలేకరి ప్రశ్నించారు. ‘ప్రభుత్వం వేలం వేస్తున్న భూమి గ్రీన్ ఏరియా. అక్కడ ఎన్నో ఐటీ పార్కులున్నాయి. నాకు తెలిసి వాటిలో సగం వరకు ఖాళీగా ఉన్నాయి. నిజంగా అభివృద్ధి చేయాలంటే టైర్-2 సిటీస్పై దృష్టి పెట్టొచ్చు. కానీ 400 ఎకరాల్లో చెట్లు కొట్టకపోతేనే మంచిదనిపిస్తుంది’ అని పేర్కొన్నారు. వీలుంటే ఆ భూములను కాపాడేందుకు మీడియా ప్రయత్నించాలని సూచించారు.