Kamalasan Reddy | నేరాలకు పాల్పడుతున్న నేరస్తులకు శిక్షలు పడితే వారిలో భయం ఏర్పడుతుందని, నేరాలకు పాల్పడాలని భావించేవారికి కూడా నేరస్తులకు పడే శిక్షలు కనువిప్పు కలిగేలా చేస్తాయని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు. అబ్కారీ భవన్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు కేసుల్లో శిక్షలు పడేలా కృషి చేసిన 29 మంది అధికారులకు కమలాసన్‌రెడ్డి క్యాష్ రివార్డులు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓ వైపు ఎక్సైజ్‌శాఖ, మరో వైపు రెవెన్యూశాఖ గంజాయి, డ్రగ్స్, ఎన్పీడీఎల్ కంట్రోల్ చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేసులను సరైన నీతిలో విచారించిన సమయంలో నిందితులక శిక్షలు పడుతాయన్నారు. పోలీసుల తరహాలో విచారణ జరిపిన సమయంలో నిందితులకు శిక్షలు పడుతాయన్నారు. పోలీసుల రీతిలో ఎక్సైజ్‌శాఖ పని చేయించడానికి పోలీస్ అకాడమీలో శిక్షణ ఇప్పించే కార్యక్రమం చేపట్టామన్నారు.
తెలంగాణ ఏర్పాటు నుంచి ఎక్సైజ్‌శాఖలో తక్కువ కేసుల్లో శిక్షలు పడ్డాయని.. ఈ విషయంలో సరియైన మార్గదర్శం చేయడంతో 2024లో పది కేసుల్లో ఐదేళ్లు, మూడేళ్లు శిక్షలు పడడం మంచి పరిణామమని కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. గతం ఎలా గడిచినా.. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల్లో శిక్షలు పడే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. డైరెక్టర్ మార్గదర్శంలో ఎక్సైజ్‌శాఖలో కూడా కేసుల నమోదు నుంచి శిక్షలు పడే వరకు సిబ్బంది తర్ఫీదు పొందారని, సిబ్బందికి క్యాష్ రివార్డులతో ప్రోత్సహించడం ఆనందంగా ఉందని జాయింట్ కమిషనర్ ఖరేషీ అన్నారు.
34 కేసుల్లో ప్రతిభ కనబరిచిన 29 మందికి డైరెక్టర్ చేతుల మీదుగా క్యాష్ రివార్డులను అందించారు. అవార్డులు అందుకున్న వారిలో సంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ ప్రాంతానికి చెందిన ఎక్సైజ్‌శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ప్రణవీ, అడిషనల్ ఎస్పీ భాస్కర్, ఎక్సైజ్ సూపరిండెంట్లు ప్రదీప్‌రావు, నంద్యాల అంజిరెడ్డి, డీఎస్పీ తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.