హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : వైమానిక రంగంలో ఏర్పడుతున్న సాంకేతిక నిపుణుల డిమాండ్‌ను తీర్చడానికి కొత్తగా డిప్లొమా ఇన్ ఏయిర్క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజినీరింగ్(ఏఎంఈ) కోర్సును రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశపెట్టబోతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒక కాలేజీలో 60 సీట్లతో ఈ కోర్సు అందుబాటులోకి రానున్నది. విమానాల మరమ్మతులు, సర్టిఫైచేయడం వంటి అంశాల్లో ఈ కోర్సుల్లో చేరిన వారికి శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో ఓ రెండు ప్రైవేట్ సంస్థలు ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ కోర్సులో శిక్షణ ఇస్తుండగా, ప్రస్తుతం ఒక ప్రభుత్వ కాలేజీలో ప్రవేశపెట్టి, క్రమంగా విస్తరించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం 10 కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. డిప్లొమా ఇన్ సెమికండక్టర్ టెక్నాలజీ కోర్సును కొత్తగా 12 కాలేజీల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఒక్క కోర్సులోనే 720 సీట్లు ఉండబోతున్నాయి. 8 కాలేజీల్లో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ కోర్సు అందుబాటులోకి రానున్నది. అడ్వాన్స్డ్ మ్యాన్ఫ్రాక్చరింగ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్ రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఇంటిరియర్ డిజైన్, ల్యాండ్‌స్కేప్ డిజైన్ వంటి కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.
వసతులెలా..?
ఈ 10 కొత్త కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి పొందాల్సి ఉంది. ఏఐసీటీఈకి దరఖాస్తు చేయడంలో తీవ్ర ఆలస్యమైంది. దీంతో సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని దరఖాస్తు చేశారు. ఆలస్యంగా దరఖాస్తు చేయడంతో అనుమతులొచ్చేనా..? అన్న ప్రశ్నలొస్తున్నాయి. కొత్త కోర్సుల మాటెలా ఉన్నా.. కాలేజీల్లో కోర్సులకు అనుగుణంగా తరగతి గదులు, ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ సమస్య తలెత్తుతున్నది. జూన్‌లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. అంటే ఇంకా మరో మూడు నెలలు మాత్రమే ఉంది. అంతలోపు వసతులు సమకూరుతాయా..? అన్న ప్రశ్నలొస్తున్నాయి. వసతులపై ఆరా తీసేందుకు సాంకేతిక విద్యాశాఖ కొందరు అధికారుల చేత తనిఖీలు చేయిస్తున్నది. ఈ తనిఖీలు ముగిసిన తర్వాత ఓ నివేదికను రూపొందించి, వసతులు కల్పించడంపై దృష్టిపెట్టనున్నది.