జనగామ రూరల్, నవంబర్ 10: డిజిటల్ సర్వేను సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేస్తున్నామని ఏఈవోల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడు బాదావత్ రాజ్‌కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం జనగామలో ఏఈవోల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించగా 31 జిల్లాల ఏఈవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. అనంతరం నూతన అధ్యక్షుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే కారణంగా ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఏఈవోలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. డిజిటల్ సర్వేకు ఏఈవోలు వ్యతిరేకం కాదని, రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మంది చేయాల్సిన సర్వేను ప్రభుత్వం 2,600 మందితో నిర్వహించడం సాధ్యంకాదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే డిజిటల్ సర్వేపై పునరాలోచన చేయాలని కోరారు.