హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): పైరసీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి భారీ నష్టాన్ని తీసుకొచ్చిన ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేయడంతో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హిరో చిరంజీవి, నాగార్జున, డైరెక్టర్ రాజమౌళి, నిర్మాతలు దిల్‌రాజ్, అక్కినేని వెంకట్ తదితరులు సీనీ సజ్జనార్‌ను అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పైరసీతో ఇండస్ట్రీకి నష్టం చేస్తున్న సైబర్‌నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేయడం అభినందనీయమన్నారు.
హీరో నాగార్జున మాట్లాడుతూ తన కుటుంబంలోనూ సైబర్‌నేరగాళ్ల బాధితులున్నారని, ఒకరిని రెండు రోజులపాటు డిజిటల్ అరెస్ట్ చేశారని తెలిపారు. రాజమౌళి మాట్లాడుతూ పోలీసులకు చాలెంజ్ విసిరిన ఐబొమ్మ రవిని పట్టుకోవడాన్ని అభినందించారు. పైరసీ సినిమాలు చూస్తే మన విలువైన డాటా పోవడమే కాకుండా, సాధారణ ప్రజలు మరింత నష్టానికి గురవుతారని అన్నారు.