హైదరాబాద్: అటవీ శాఖలో కొన్ని ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రి, కార్యదర్శి మధ్య విభేదాలు నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి తీసుకున్న నిర్ణయాలు నియమాలకు లోబడి ఉంటే సంబంధిత శాఖ కార్యదర్శి వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సలహాలు ఇచ్చి సవరించుకునే విధానం వివరించాలి. అయితే అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్ మధ్య కొన్ని ఫైళ్ల విషయంలో విబేధాలు తారా స్థాయికి చేరుకున్నట్లు సమాచారం. తన నిర్ణయాన్ని అమలు చేయాలని మంత్రి చెబుతుండగా.. రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నాయని సెక్రెటరీ పేచీలు పెడుతున్నట్లు తెలిసింది. ఈ మధ్య ఓ ఫైల్ పై మంత్రి సంతకం చేసినా.. అమలు చేయకుండా ఆ ఫైల్ ను కార్యదర్శి నేరుగా చీఫ్ సెక్రెటరీ ఆమోదం కోసం పంపడం సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పదోన్నతుల విషయంలో పంచాయతీ..!
డిపార్ట్ మెంట్ లో 29 మందికి అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటివ్ ఆఫీసర్‌గా ప్రమోషన్ ఇచ్చే విషయంలో మంత్రి సురేఖ, ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్ మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తున్నది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన 20 పోస్టులకు ప్రమోషన్ల ద్వారా నియమించేందుకు సెక్రెటరీ నదీమ్ అనుమతి ఇచ్చారని తెలిసింది. విషయం తెలుసుకున్న మంత్రి సదరు ఫైలును తనకు పంపాలని సెక్రెటరీని ఆదేశించగా, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. అయితే బిజినెస్ రూల్స్ ప్రకారం ఫారెస్ట్ ఆఫీసర్లకు ప్రమోషన్ ఇచ్చే అధికారం పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు)కు మాత్రమే ఉందని, అందుకు మంత్రి ఆమోదం అవసరం లేదని నిర్ణయానికి వచ్చిన సెక్రెటరీ.. ఆ ఫైల్‌ను మంత్రి పేషీకి పంపడం లేదని తెలిసింది. అయితే ఆ ఫైల్ తనకు పంపాలని మంత్రి ఒత్తిడి చేయడం, ఇటు సెక్రెటరీ ఫైల్ పంపకుండా రహస్యంగా ఉంచడంతో సెక్రెటేరియట్ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.
మంత్రి ఆమోదానికి తిరస్కరణ..
ఫారెస్ట్ ల్యాండ్స్‌ను కాపాడాల్సిన ఓ అటవీ శాఖ అధికారి ఆ భూములకు ఇతరులకు అప్పగించేలా అనుకూల నిర్ణయం తీసుకున్నారనే కారణంతో ఓ ఫారెస్ట్ ఆఫీసర్‌ను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని పీసీసీఎఫ్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఆ సిఫారసులను సెక్రెటరీ ఆమోదించి.. మంత్రి అనుమతి కోసం పంపారు. ముందు అంగీకారం తెలిపిన మంత్రి.. సదరు ఫైల్‌పై సంతకం చేశారని తెలిసింది. మళ్లీ ఓ సహచర మంత్రి నుంచి ఒత్తిళ్లు రావడంతో మంత్రి సురేఖ ఆ ఫైల్‌ను వెనక్కి పంపాలని సెక్రెటరీని ఆదేశించగా, ఆయన పంపినట్టు సమాచారం. అయితే, రెండోసారి తన వద్దకు వచ్చిన ఫైల్‌పై.. సదరు ఫారెస్ట్ ఆఫీసర్‌కు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వొద్దని నోట్ రాసి, మంత్రి సంతకం చేశారని తెలిసింది. కానీ, మంత్రి నిర్ణయాన్ని సెక్రెటరీ నదీమ్ అమలు చేయకుండా, ఆ ఫైల్‌ను సీఎస్ రామకృష్ణారావు ఆమోదం కోసం పంపారని సమాచారం. బిజినెస్ రూల్స్ ప్రకారం ఒక అంశంపై మంత్రి, సెక్రెటరీ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు.. సీఎస్ నిర్ణయానికి పంపడంలో తప్పేమి లేదని నదీమ్ వాదిస్తున్నట్లు సమాచారం.
నదీమ్‌పై సీఎంవోకు ఫిర్యాదు..
సెక్రెటరీ నదీమ్ తీరుపై విసిగిపోయిన మంత్రి సురేఖ ఆయనపై సీఎంవోకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఆయన సెక్రెటరీగా వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మూడు పేజీల్లో వివరించినట్లు సమాచారం. తను తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా కొర్రీలు పెట్టడం, ఫైల్స్‌పై డిస్కషన్ చేసేందుకు రావాలని పదే పదే ఫోన్ చేసినా.. స్పందించట్లేదని ఫిర్యాదులో పేర్కొనట్లు తెలుస్తున్నది. ఈపీటీఆర్ (ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఉన్నారని, వారందరిని తొలగించాలని పలుసార్లు ఆదేశించినా పట్టించుకోలేదని వివరించినట్లు సమాచారం. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరిగే పరిణామాలపై తనకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినా.. స్పందించడం లేదని కంప్లయింట్ లో చెప్పినట్లు తెలిసింది.