హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న కొత్త బిల్లును తెలంగాణ దళిత హకుల పోరాట సమితి రాష్ట్ర కౌన్సిల్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు ‘ఎంఎన్ఆర్జీఏ’ లక్ష్యాన్ని కేంద్రం నూతన బిల్లులో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కొత్త పథకంలో 100 నుంచి 125 రోజులకు ఉపాధిని పెంచుతామన్న కేంద్ర ప్రభుత్వ వాదన కేవలం ప్రకటన మాత్రమేనని పేర్కొన్నారు. వ్యవసాయ పనులు జోరుగా ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు సరికావని హితవు పలికారు. వేతనాల చెల్లింపుల్లో రాష్ట్రాలు 60:40 నిష్పత్తితో పంచుకోవాలన్న నిర్ణయం.. కేంద్ర ప్రభుత్వ బాధ్యతను తగ్గిస్తున్నదని తెలిపారు. ఈ పథకానికి ఎంఎన్ఆర్ఈజీఎస్ ఉన్న పేరును జీఆర్ఎఎంజీ (జీరామ్‌జీ)గా మార్చాలన్న ఆలోచన వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ హస్తం ఉన్నదని ఆరోపించారు. వెంటనే జీఆర్ఎఎంజీ బిల్లును ఉపసంహరించుకుని, ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.